హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని మృగవని పార్క్ సమీపంలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టిప్పర్, కాలేజీ బస్సు, ఎంజీ కారు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో చైతన్య డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన కాలేజీ బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు, ఓ కళాశాల సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఐ20 కారు మృగవని పార్క్ సమీపంలో యూటర్న్ తీసుకుంటోంది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న టిప్పర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో దాని వెనుకే వస్తున్న చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ కాలేజీ బస్సు టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు వెనుక వస్తున్న ఎంజీ కారు సైతం బస్సును ఢీకొట్టింది. దీంతో ఎంజీ కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.
ఈ వరుస ప్రమాదాల్లో బస్సులో ఉన్న ముగ్గురు విద్యార్థులతో పాటు ఓ కళాశాల సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని బస్సులోని విద్యార్థులను సురక్షితంగా కిందకు దించారు.
కిలోమీటర్ మేర నిలిచిపోయిన ట్రాఫిక్
వరుస ప్రమాదాల కారణంగా రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు చొరవ తీసుకుని ప్రమాదానికి గురైన కాలేజీ బస్సును రహదారి పక్కకు తొలగించడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది. అనంతరం వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
